Hamas: హమాస్‌ను అంతం చేయాలని ప్రమాణం చేసుకున్నాను.. ఏదీ ఆపలేదు: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

I vowed to end Hamas and Nothing will stop says Israeli PM Netanyahu
  • అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్‌తో సమావేశంలో స్పష్టం చేసిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి
  • గాజా స్ట్రిప్‌లో మానవతా సాయంపై చర్చించామన్న అమెరికా
  • పాలస్తీనాలో శాంతి, భద్రతలకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటన
హమాస్‌ను అంతమొందించాలని ఇజ్రాయెల్ ప్రమాణం చేసిందని, ఈ విషయంలో తమను ఎవరూ ఆపలేరని ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం పునరుద్ఘాటించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌‌కు ఇదే విషయం చెప్పానని నెతన్యాహు శుక్రవారం అన్నారు. జెరూసలెంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో బ్లింకెన్‌తో ఆయన సమావేశమయ్యారు. ‘‘హమాస్‌ను అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రమాణం చేసింది. నేనూ ప్రమాణం చేశాను. మమ్మల్ని ఏదీ ఆపబోదు’’ అని నెతన్యాహు చెప్పినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ రిపోర్ట్ పేర్కొంది. 

హమాస్ చెరలో మిగిలిన బందీలు అందరినీ విడిపించే ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గాజా స్ట్రిప్‌లో కీలకమైన మానవతా సాయాన్ని వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతపై కూడా మాట్లాడినట్టు వివరించింది. సైనిక కార్యకలాపాలకు ముందు మానవతా, పౌర రక్షణ విషయంలో చర్యలను నిర్ధారించాలని నెతన్యాహును బ్లింకెన్ కోరినట్టు తెలిపింది. 

వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై హింసకు పాల్పడుతున్న సెటిలర్ అతివాదులను నియంత్రించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధానిని కోరారని పేర్కొంది. పాలస్తీనాలో శాంతి, స్వేచ్చ, భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని బ్లింకెన్ తెలిపినట్టు ప్రకటనలో స్పష్టం చేసింది. జెరూసలేంలో ఇద్దరు వ్యక్తులను హమాస్ ఉగ్రవాదులు కాల్చిచంపిన అనంతరం వీరిద్దరి భేటీ జరిగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఎనిమిది మంది అమాయకులు గాయాలపాలయ్యారు.
Hamas
Israel
Benjamin Netanyahu
Antony Blinken

More Telugu News