Chandrababu: నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కీలక సమావేశం
- సాయంత్రం టీటీడీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
- పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
- వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టే అంశంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన తిరుమల నుంచి అమరావతిలోని తన నివాసానికి బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. డిసెంబర్ 4వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. పార్లమెంట్ వేదికగా వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే విషయంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ నెల 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. రేపు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. వాస్తవానికి ఈ సమావేశం 3వ తేదీన నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే, 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో సమావేశాన్ని ఒక రోజు ముందుకు జరిపారు.