Crime News: టాయిలెట్ కోసం బస్సు ఆపమంటే కిందికి తోసేసిన కండక్టర్.. కూలీ మృతి
- ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో ఘటన
- అర్ధరాత్రి టాయిలెట్ కోసం ఆపమన్నందుకు ఘోరం
- బస్సు వెనక చక్రాలకింద పడి దుర్మరణం
- పరారీలో బస్సు డ్రైవర్, కండక్టర్
టాయిలెట్ కోసం బస్సు ఆపమన్న కూలీని కిందకు తోసేశాడో కండక్టర్. కిందపడి తీవ్రంగా గాయపడిన కూలీ మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కూలిపనులు చేసే పిలిభిత్ జెహానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌కు చెందిన విజయపాల్ (38) దీపావళికి ఇంటికొచ్చాడు. తాజాగా, తన కుటుంబంతో కలిసి డబుల్ డెక్కర్ ప్రైవేటు బస్సులో తిరిగి జైపూర్ బయలుదేరాడు. అర్ధరాత్రి వేళ మూత్ర విసర్జన కోసం బస్సు ఆపాలని కండక్టర్‌ను విజయ్‌పాల్ కోరాడు. అందుకు అతడు నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.
ఈ క్రమంలో బస్సు పిలిభిత్ బైపాస్‌లోని సంజయ్‌నగర్ టర్న్ వద్దకు చేరుకోగానే విజయ్‌పాల్‌ను కండక్టర్ బస్సు నుంచి ఒక్కసారిగా కిందికి తోసేశాడు. బస్సు వెనక చక్రాల కిందపడిన విజయ్‌పాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన ప్రజలు బస్సుపై రాళ్లు రువ్వారు. బస్సు డ్రైవర్, కండక్టర్‌ను అరెస్ట్ చేయాలని విజయ్‌పాల్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని శాంతింపజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్, కండక్టర్ కోసం గాలిస్తున్నారు.