Australia: ‘ఆస్ట్రేలియా క్రికెటర్లకు అహంకారం’ అని వ్యాఖ్యానించిన నెటిజన్‌కు డేవిడ్ వార్నర్ రిప్లై ఇదే
- ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఎవరినైనా కలిశావా అని ప్రశ్నించిన డేవిడ్ వార్నర్
- కంప్యూటర్ కీ బోర్డ్ నుంచి జాలువారిందా అని అడిగిన ఆసీస్ స్టార్
- భారత్‌పై ఫైనల్ గెలిచాక ఆస్ట్రేలియా ఆటగాళ్లను విమర్శించిన భారత ఫ్యాన్స్
క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీలను ఎగరేసుకుపోవడం ఆస్ట్రేలియాకు సునాయాసంగా మారిపోయింది. వరల్డ్ కప్ 2023తో ఏకంగా 6వ సారి ట్రోఫీని ముద్దాడింది. భారత్ ఆతిథ్యం ఇచ్చిన ఈ వరల్డ్ కప్‌లో ఆసీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న కంగారూలు అప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని భారత్‌ను ఫైనల్లో మట్టికరిపించారు. దీంతో నిరాశకు గురైన భారత అభిమానులు ఆస్ట్రేలియా ఆటగాళ్లు టార్గెట్‌గా సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఆసీస్ ప్లేయర్లను విమర్శిస్తూ పలు పోస్టులు పెట్టారు. అందులో ఒక యూజర్ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు అహంకారమని వ్యాఖ్యానించాడు.
‘‘గతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాగా అహంకారంతో ఉండేవాళ్లు. ఈ వరల్డ్ కప్ గెలిచాక అది మరింత ఎక్కువైంది’’ అని డేవిడ్ వార్నర్‌ని ట్యాగ్ చేస్తూ ఓ యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకి డేవిడ్ వార్నర్ రిప్లై ఇచ్చాడు. ‘‘ ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఎవరినైనా కలిశావా లేక కంప్యూటర్ కీబోర్డ్ నుంచి జాలువారిందా?’’ అని సరదాగా ప్రశ్నించారు. స్మైలీ ఎమోజీలను జోడించాడు. వీరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.