Cockroach In Biryani: ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అదనపు ప్రొటీన్ కోసం చచ్చిన బొద్దింకను కూడా పంపారు.. జొమాటో యూజర్‌కు వింత అనుభవం!
- హైదరాబాద్ కోఠిలోని గ్రాండ్ హోటల్ నుంచి ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేసిన యూజర్
- తింటుండగా కనిపించిన చచ్చిన బొద్దింక
- సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్
ఫుడ్ డెలివరీ యాప్‌లు పెరిగిన తర్వాత రెస్టారెంట్ల నుంచి ఆహారం తెప్పించుకోవడం చాలా సర్వసాధారణంగా మారింది. నిమిషాల్లో డెలివరీ చేసి ఆకలి తీర్చే జొమాటో, స్విగ్గీ వంటివాటిపై జనం మనసు పారేసుకుంటున్నారు. బ్యాచిలర్లే కాదు.. అప్పుడప్పుడు ఇంటిల్లిపాదీ ఆహారాన్ని ఆర్డర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, కొన్నిసార్లు ఇలాంటివి చేదు అనుభవాన్ని మిగిలిస్తూ ఉంటాయి. ఆహారంలో అనుకోని ‘అతిథులు’ కనిపిస్తూ మరోసారి వాటి జోలికి పోకుండా చేస్తాయి.
తాజాగా హైదరాబాద్‌లోని ఓ వినియోగదారుకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. కోఠిలోని గ్రాండ్ హోటల్ నుంచి జొమాటో ద్వారా బిర్యానీ ఆర్డర్ చేస్తే.. దాంతోపాటు చచ్చిన బొద్దింకను కూడా కలిపి పంపారు. ఆవురావురుమంటూ తింటున్న ఆ యూజర్‌కు మధ్యలో ఏదో తేడాగా కనిపిస్తే తీరిగ్గా చూసి కంగారుపడ్డాడు. అది చచ్చిన బొద్దింక. వెంటనే తినడాన్ని ముగించి దానిని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అనుభవాన్ని కూడా రాసుకొచ్చాడు.
‘‘కోఠిలోని గ్రాండ్ హోటల్ నుంచి జొమాటో ద్వారా ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఆ హోటల్ సిబ్బంది నాపై చాలా దయచూపారు. మరింత అదనపు ప్రొటీన్ కోసం చచ్చిన బొద్దింకను కూడా పంపారు. మీరు పురుగులు గట్రా తింటే తప్ప ఇక్కడి నుంచి ఆహారం తెప్పించుకోవద్దు’’ అని రాసుకొచ్చాడు.
ఈ పోస్టుకు నెటిజన్లు విరగబడి కామెంట్లు చేస్తున్నారు. తానైతే నెలలో రెండుమూడుసార్లు ఈ హోటల్ నుంచే తెప్పించుకుంటానని, నిజంగా ఇది షాకింగ్ అని ఓ యూజర్ రాసుకొచ్చాడు. ఆ బొద్దింకను ఏం చేశావు? అది పుట్టిన ప్రదేశం నుంచి చాలా దూరం వచ్చేసింది.. అని మరొకరు కామెంట్ చేశారు. ఇదే ఘటన అమెరికాలో జరిగి ఉంటే వచ్చే నెలకి నువ్వు మిలియనీర్ అయిపోతావు అని మరొకరు, దీనిని చాలా తీవ్రంగా పరిగణించాలని, అధికారులకు ఫిర్యాదు చేయాలని ఇంకొకరు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ హోటళ్లలో నాణ్యత నానాటికీ తీసికట్టుగా మారుతోందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.