Bengaluru: బెంగళూరులో 45 పాఠశాలలకు బాంబు బెదిరింపులు
- బెంగళూరులో బాంబు బెదిరింపుల తీవ్ర కలకలం
- ఒకేసారి పెద్ద సంఖ్యలో స్కూళ్లకు బెదిరింపు ఈ-మెయిల్స్
- క్షుణ్ణంగా తనిఖీలు చేసిన బాంబు డిస్పోజల్ బృందాలు
- ఉత్తుత్తి బెదిరింపులేనని తేల్చిన బెంగళూరు పోలీసులు
ఒకేసారి పెద్ద సంఖ్యలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది. నగరంలోని 45 పాఠశాలల్లో బాంబులు పెట్టామంటూ ఆయా పాఠశాలల సిబ్బందికి బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. మీ స్కూల్లో బాంబు పెట్టాం... ఏ క్షణమైనా పేలొచ్చు అంటూ ఆ ఈ-మెయిల్స్ లో పేర్కొన్నారు.
దీనిపై బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి.దయానందగౌడ స్పందించారు. పెద్ద సంఖ్యలో బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్లను రంగంలోకి దింపామని, బెదిరింపులు వచ్చిన ప్రతి స్కూల్లోనూ అణువణువు తనిఖీ చేశారని వెల్లడించారు.
అయితే, ఎక్కడా బాంబులు లేవని, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని స్పష్టం చేశారు. చూస్తుంటే, ఇవి ఉత్తుత్తి బెదిరింపుల్లా ఉన్నాయని సీపీ దయానంద గౌడ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవ్వాల్సిన పనిలేదని పేర్కొన్నారు. గతేడాది కూడా ఇలాగే స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ ఉత్తుత్తి ఈ-మెయిల్స్ వచ్చాయని అన్నారు.