Cyclone Michaung: నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న తుపాను... కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
- ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం
- డిసెంబరు 3 నాటికి తుపాను
- తుపాను ఏపీ తీరం దిశగా వస్తుందన్న ఐఎండీ
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండికి తుపానుగా మారనుంది. ఇది డిసెంబరు 4 వరకు పశ్చిమ వాయవ్య దిశగా, ఆపై దాదాపు ఉత్తర దిశగా కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా పయనించి నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
డిసెంబరు 3 నుంచి 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుపాను వేళ అత్యవసర సాయం, సమాచారం కోసం ఈ స్టేట్ కంట్రోల్ రూం ప్రారంభించారు.
స్టేట్ కంట్రోల్ రూం ద్వారా సాయం, సమాచారం పొందగోరే వారు 1070, 112, 18004250101 నెంబర్లలో సంప్రదించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.
ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితిని పర్యవేక్షిస్తుంటామని, జిల్లాల అధికార యంత్రాగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామని తెలిపింది. తుపాను నేపథ్యంలో... రైతులు, కూలీలు, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.