India: పురుషుల టీ20 క్రికెట్లో పాకిస్థాన్ రికార్డును బద్దలు కొట్టిన భారత్
- 136వ గెలుపుతో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచిన టీమిండియా
- 135 విజయాలతో రెండవ స్థానానికి పడిపోయిన పాకిస్థాన్
- ఆస్ట్రేలియాపై 4వ టీ20 మ్యాచ్ గెలుపుతో చరిత్ర సృష్టించిన భారత్
రాయ్‌పూర్ వేదికగా 4వ టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన భారత్ చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ అవతరించింది. 213 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 136 విజయాలు సాధించింది. దీంతో పాకిస్థాన్ రికార్డును భారత్ బద్దలుకొట్టింది. 226 మ్యాచ్‌లు ఆడిన పాక్ 135 విజయాలతో రెండవ స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ 200 మ్యాచ్‌ల్లో 102 విజయాలు, దక్షిణాఫ్రికా 171 మ్యాచ్‌ల్లో 95, ఆస్ట్రేలియా 181 మ్యాచ్‌ల్లో 95 విజయాలతో ఆ తర్వాతి వరుస స్థానాల్లో ఉన్నాయి. దీంతో టీ20 ఫార్మాట్లో విజయాల సంఖ్య పరంగా టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారం ఆస్ట్రేలియాపై 4వ టీ20 మ్యాచ్‌లో విజయంతో ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా బీసీసీఐ ప్రకటించింది. రాయ్‌పూర్‌లో ప్రత్యేక విజయాన్ని సాధించారని భారత ఆటగాళ్లకు అభినందనలు తెలిపింది.
భారత్, పాకిస్థాన్ జట్లు ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తున్నప్పటికీ సాధించిన విజయాలు తక్కువేమీ కాదు. ఈ విజయాలను బట్టి టీ20 ఫార్మాట్లో టీమిండియా స్థిరత్వాన్ని తెలియజేస్తున్నాయి. 2007లో ఆరంభ టీ20 వరల్డ్ కప్‌ను భారత్ కైవశం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ఫార్మాట్లో భారత్ స్థిరంగా రాణిస్తోంది. కాగా రాయ్‌పూర్ వేదికగా జరిగిన 4వ టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సీరిస్‌ను 3-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన రింకూ సింగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో పర్యాటక ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 20 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.