ED Officer: ప్రభుత్వ అధికారి నుంచి రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఈడీ అధికారి
- తమిళనాడులోని దిండిగల్‌లో ఘటన
- ముగిసిన కేసును మళ్లీ తెరవమని పీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయని ఉద్యోగిని బెదిరించిన ఈడీ అధికారి
- కేసు క్లోజ్ చేయాలంటే రూ. 3 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్
- చివరికి రూ. 51 లక్షలకు ఒప్పందం
- రెండో విడత రూ. 20 లక్షలు తీసుకుంటుండగా దొరికిన వైనం
- కేసులో పలువురు పెద్ద తలకాయలు
- పలువురు బాధితుల నుంచి కోట్ల రూపాయలు దండుకున్న నిందితుడు
ప్రభుత్వ అధికారి నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడో ఈడీ అధికారి. తమిళనాడులోని దిండిగల్‌లో జరిగిందీ ఘటన. నిందితుడైన అధికారిని అంకిత్ తివారీగా గుర్తించారు. అక్టోబరు 29న దిండిగల్ జిల్లా విజిలెన్స్, అవినీతి నిరోధక (డీవీఏసీ) విభాగం ఉద్యోగికి అంకిత్ ఫోన్ చేశాడు. ఆయనపై గతంలో నమోదై, ముగిసిన కేసును దర్యాప్తు చేయాలని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని రేపు (అక్టోబరు 30న) మధురైలోని ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని కోరాడు.
నిజమేనని నమ్మిన ఉద్యోగి 30న ఈడీ కార్యాలయానికి వెళ్లాడు. రూ. 3 కోట్లు ఇస్తే కేసును క్లోజ్ చేస్తానని అక్కడ తివారీ అతడితో బేరం పెట్టాడు. ఆ తర్వాత రూ. 51 లక్షలు ఇస్తే సరిపోతుందని, ఉన్నతాధికారులు కూడా అందుకు సరేనన్నారని చెప్పుకొచ్చాడు. అంగీకరించిన ప్రభుత్వ ఉద్యోగి నవంబరు 1న తొలి ఇన్స్టాల్మెంట్గా రూ. 20 లక్షలు అందించాడు. ఆ తర్వాత మిగతా డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. ఈ మొత్తాన్ని పై అధికారులకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని, కాబట్టి తొందరగా ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు.
అంకిత్ వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన ప్రభుత్వ ఉద్యోగి నవంబరు 30న డీవీసీఏకు ఫిర్యాదు చేశాడు. నిన్న ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ. 20 లక్షలు తీసుకుంటుండగా రాష్ట్ర విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగం రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకుంది. నిందితుడికి కోర్టు ఈ నెల 15 వరకు జుడీషియల్ రిమాండ్ విధించింది.
ఆ తర్వాత డీవీసీఏ అధికారులు మధురైలోని ఈడీ కార్యాలయంతోపాటు నిందితుడు అంకిత్ తివారీ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. అంకిత్ తివారీ ఇలా ఎంతోమందిని బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. మధురై, చెన్నైకి చెందిన పలువురు ఈడీ అధికారుల హస్తం కూడా దీనివెనక ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు.