Counting: ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగేదిలా..!
- కౌంటింగ్ కేంద్రంలోకి సిబ్బందితో పాటు ఏజెంట్లకు ఎంట్రీ
- ముందుగా ఈవీఎంల సీల్ పరిశీలన
- రౌండ్ రౌండ్ కూ ఫలితాల ప్రకటన
- కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డ్
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన 49 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. నియోజకవర్గానికి కేటాయించిన టేబుళ్ల వద్దకు ఎలక్షన్ సిబ్బంది, అభ్యర్థుల ప్రతినిధులను (గరిష్ఠంగా 14 మంది ఏజెంట్లను) అనుమతిస్తారు. ఆ లెక్కింపు కేంద్రం పరిశీలకుడు మినహా మిగతా ఎవరికీ సెల్ ఫోన్ తీసుకు వచ్చే అధికారం లేదు. ముందుగా ఈవీఎంలను పరిశీలిస్తారు. సీల్ ట్యాంపరింగ్ జరగలేదని నిర్ధారించుకునేందుకు ఆ టేబుల్ దగ్గర ఉన్న సిబ్బంది, ఏజెంట్లు ఈవీఎంను పరిశీలిస్తారు. ఈవీఎంల సీల్ పై ఏజెంట్లకు అనుమానం కలిగితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు.
ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు బాధ్యత అంతా రిటర్నింగ్ అధికారి పైనే ఉంటుంది. పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లను లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 14 మందికి మించకుండా ఏజెంట్లను అనుమతిస్తారు.
ఫారం-17 సి లో నమోదు చేసిన ఓట్లను ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్యతో సరిచూస్తారు. కౌంటింగ్ సిబ్బంది ఆ సంఖ్యను ఫారం 17 సి పార్ట్ 2 నోట్ చేసుకుని, దానిపై ఏజెంట్ల సంతకం తీసుకుంటారు. అనంతరం ఈవీఎంల సీల్ తొలగించి రిజల్ట్ బటన్ నొక్కుతారు. ఆ ఈవీఎంలో పోలైన ఓట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయం తెలుస్తుంది. ఆ వివరాలను కౌంటింగ్ సిబ్బంది నోట్ చేస్తారు. ఆ సంఖ్యను ఏజెంట్లు అందరికీ చూపించి, వారు సంతృప్తి వ్యక్తం చేశాకే రౌండ్ ఫలితాలను వెల్లడిస్తారు. ఒక్కో రౌండ్ లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే వివరాలను కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన బోర్డుపై సిబ్బంది రాస్తారు. ఈ ప్రక్రియ మొత్తాన్నీ వీడియో తీసి భద్రపరుస్తారు.