Rahul Gandhi: కాంగ్రెస్ అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రాలు దాటి బయటికి రావొద్దు: రాహుల్ గాంధీ
- తెలంగాణలో రేపు ఓట్ల లెక్కింపు
- తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ వర్చువల్ సమావేశం
- కాంగ్రెస్ అభ్యర్థులకు దిశానిర్దేశం
- ఇబ్బందులు ఉంటే రాష్ట్ర నాయకత్వానికి చెప్పాలని సూచన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనున్న నేపథ్యంలో సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే విజయం అంటుండగా, గతంలోనూ ఎగ్జిట్ పోల్స్ ఇలాగే చెప్పాయని బీఆర్ఎస్ అంటోంది. ఈ నేపథ్యంలో, ఫలితాల సరళిపై ఆసక్తి పెరిగింది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నేతలతో వర్చువల్ గా భేటీ అయ్యారు. అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రాలు దాటి బయటికి రావొద్దని స్పష్టం చేశారు. ఏఐసీసీ పరిశీలకులు కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలని సూచించారు. ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందించాలని నిర్దేశించారు.
కౌంటింగ్ నేపథ్యంలో, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. హోటల్ తాజ్ కృష్ణ నుంచి ఆయన కౌంటింగ్ సరళిని పర్యవేక్షించనున్నారు.