Pakistan: పాక్ లో టెర్రర్ దాడి.. 8 మంది మృతి
- ప్రయాణికుల బస్సుపై దుండగుల కాల్పులు
- ఘిజర్ నుంచి రావల్పిండి వెళుతుండగా ఘటన
- మృతుల్లో పలువురు సైనికులతో పాటు సామాన్యులు కూడా..
- టెర్రర్ దాడిగా అనుమానిస్తున్న పోలీసులు
పాకిస్థాన్ లోని గిల్గిట్ బాల్టిస్థాన్ లో టెర్రర్ అటాక్ జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సుపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మరణించారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. చనిపోయిన వారిలో పలువురు సైనికులతో పాటు సామాన్యులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
పాక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘిజర్ నుంచి రావల్పిండి వెళుతున్న ప్యాసింజర్ బస్సుపై చిలాస్ సిటీ దగ్గర్లో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో ప్రయాణికులలో ఎనిమిది మంది చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి ఈ ఘోరం చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారని వివరించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని, దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. కాల్పులు జరిపింది టెర్రరిస్టులేనని అనుమానిస్తున్నట్లు పోలీసులు వివరించారు.