Seethakka: నా గోస తగిలే బీఆర్ఎస్ ఓటమి: ఎమ్మెల్యే సీతక్క
- సిన్సియర్ గా తాను చేసిన సేవనూ అవమానించారని ఆరోపణ
- రాష్ట్రంలో ప్రజాసంక్షేమ రాజ్యం ఏర్పడుతుందని వెల్లడి
- డబ్బు వెదజల్లి తనను ఓడించాలని కుట్ర చేశారని విమర్శ
తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఏర్పడుతుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. సీఎల్పీ లీడర్ ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు వెళుతూ ఆమె మీడియాతో మాట్లాడారు. తన గోస తగలడం వల్లే బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయిందని సీతక్క పేర్కొన్నారు. ములుగులో తనను ఓడించేందుకు బీఆర్ఎస్ నేతలు చాలా దుర్మార్గాలకు పాల్పడ్డారని ఆరోపించారు. చివరకు సిన్సియర్ గా తాను చేసిన సేవను కూడా అవమానించారని సీతక్క వాపోయారు.
నియోజకవర్గంలో 200 కోట్లు వెదజల్లి తనను ఓడించేందుకు కుట్ర పన్నారని మరోమారు సీతక్క ఆరోపించారు. అయితే, ములుగు ప్రజలు బీఆర్ఎస్ లీడర్ల కుట్రలను తిప్పికొట్టారని, వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలందరి సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం ఏర్పడనుందని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో ములుగు నియోజకవర్గానికి తప్పకుండా తగిన ప్రాధాన్యం లభిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ములుగు నుంచే మొదలైందని, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా రాష్ట్రంలో విజయభేరీ కూడా ములుగు నుంచే ప్రారంభించారని సీతక్క గుర్తుచేశారు.