G. Kishan Reddy: కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించిన జెయింట్ కిల్లర్ కాటిపల్లి: కిషన్ రెడ్డి
- 75 ఏళ్ల దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అన్న కిషన్ రెడ్డి
- తెలంగాణలో ఓటు బ్యాంకు 14 శాతానికి పెరిగిందన్న కేంద్రమంత్రి
- తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని వ్యాఖ్య
కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో వున్న రేవంత్ రెడ్డిని తమ పార్టీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఓడించారని, 75 ఏళ్ల దేశ రాజకీయ చరిత్రలో ఇది మొదటిసారి జరిగిందని, కాటిపల్లి జెయింట్ కిల్లర్‌గా మారి కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాటిపల్లికి శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. మూడు రాష్ట్రాలలో బీజేపీ అద్భుత విజయం సాధించిందని, తెలంగాణలోనూ తమ ఓటు బ్యాంకు 14 శాతానికి పెరిగిందని గుర్తు చేశారు.
అయితే, తాము అనుకున్న ఫలితాలు రాలేదన్నారు. జాతీయ నాయకత్వంతో సమీక్షించి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. లోక్ సభ ఎన్నికల నాటికి తాము సమాయత్తమవుతామన్నారు. తెలంగాణ ప్రజల తీర్పును తాము గౌరవిస్తామన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించి బీజేపీ, కాటిపల్లి చరిత్ర సృష్టించారన్నారు. తెలంగాణలో ఓటింగ్ శాతం పెరిగిన ఏకైక పార్టీ బీజేపీయే అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేశాయన్నారు.