Virat Kohli: కింగ్ కోహ్లీకి అరుదైన గౌరవం
- చేంజ్ మేకర్స్ ఆఫ్ ఇండియా-2023 జాబితా విడుదల చేసిన అవుట్ లుక్
- ఈ జాబితాలో ఉన్న ఏకైక క్రికెటర్ కోహ్లీనే!
- చేంజ్ మేకర్స్ జాబితాలో గడ్కరీ, రాహుల్ గాంధీ, రాజమౌళి, షారుఖ్ ఖాన్
టీమిండియా బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం లభించింది. అవుట్ లుక్ బిజినెస్ మ్యాగజైన్ చేంజ్ మేకర్స్ ఆఫ్ ఇండియా-2023 పేరుతో ప్రభావశీల వ్యక్తుల జాబితాను వెలువరించింది. ఇందులో స్థానం సంపాదించుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే. ఈ జాబితాలో నితిన్ గడ్కరీ, రాహుల్ గాంధీ, రాజమౌళి, షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ, నీరజ్ చోప్రా, నందన్ నీలేకని వంటి ప్రముఖులు ఉన్నారు.
35 ఏళ్ల కోహ్లీ ఇప్పటివరకు 111 టెస్టులాడి 42.29 సగటుతో 8,676 పరుగులు చేశాడు. అందులో 29 సెంచరీలు, 29 అర్ధసెంచరీలు ఉన్నాయి. 292 వన్డేల్లో 58.67 సగటుతో 13,848 పరుగులు చేశాడు. అందులో రికార్డు స్థాయిలో 50 సెంచరీలు, 72 అర్ధసెంచరీలు ఉన్నాయి. 115 అంతర్జాతీయ టీ20లు ఆడిన కోహ్లీ 4,008 పరుగులు సాధించాడు. టీ20ల్లో కోహ్లీ పేరిట 1 సెంచరీ, 37 అర్ధసెంచరీలు ఉన్నాయి.
ఇక, అత్యధిక టెస్టుల్లో కెప్టెన్ గా వ్యవహరించిన వారి జాబితాలో కోహ్లీ (68) ఆరో స్థానంలో ఉన్నాడు. టెస్టు మ్యాచ్ ల్లో వేగంగా 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్ కోహ్లీనే. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో కోహ్లీ మూడో వాడు. అంతేకాదు, వన్డేల్లో వేగంగా 13 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఘనత కూడా కోహ్లీ ఖాతాలో ఉంది.