Pawan Kalyan: తీవ్ర తుపాను ముంచుకొస్తోంది...  ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan calls for action in the wake of Cyclone Michaung
  • ఏపీ తీరాన్ని వణికిస్తున్న మిగ్జామ్ తీవ్ర తుపాను
  • ప్రభుత్వం సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్న పవన్ 
  • ఇది తీవ్ర తుపాను అని రెడ్ అలర్ట్ కూడా ఇచ్చారని వెల్లడి 
  • సహాయక చర్యల్లో పాల్గొనాలని జనసేన శ్రేణులకు పిలుపు 
ఏపీపై మిగ్జామ్ తుపాను తీవ్ర ప్రభావం చూపించబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసిందని, ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని జనసేనాని పవన్ కల్యాణ్ కోరారు. తీవ్ర తుపాను ముంచుకొస్తోందని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

ఇది తీవ్ర తుపాను అని రెడ్ అలర్ట్ కూడా ఇచ్చారని, అందువల్ల తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహాయక చర్యల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు పాలుపంచుకోవాలని... ఆహారం, ఔషధాలు వంటి అత్యవసర వస్తువులు అందించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో తుపాను నష్టాన్ని అంచనా వేయాలని కూడా పార్టీ నేతలకు సూచిస్తున్నట్టు తెలిపారు. 

ఇది పంటలు చేతికి వచ్చే సమయం అని, పంటలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తులు మిగిల్చే నష్టాలతో రైతాంగం కుదేలైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్ట పరిహారం లెక్కించడంలో మానవతా దృక్పథంతో అధికారులు వ్యవహరించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
Pawan Kalyan
Cyclone Michaung
AP Govt
Janasena
Andhra Pradesh

More Telugu News