Gajwel: గజ్వేల్ ఎమ్మెల్యేగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న కేసీఆర్.. ఎవరు అందించారంటే..!
- గజ్వేల్ గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందజేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి
- పక్కనే ఉన్న మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
- సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేసిన బీఆర్ఎస్ వర్గాలు
గజ్వేల్ నియోజకవర్గంలో 40 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్ వద్దకు వెళ్లి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈ పత్రాన్ని అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోని పార్టీ వర్గాలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుతోపాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఫొటోలో వున్నారు.
అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు సీఎం కేసీఆర్‌ని కలిశారు. ఎమ్మెల్యేలుగా గెలిచినవారందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో హుందాగా పక్కకు తప్పుకున్నామని, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని అన్నారు. కాంగ్రెస్ సర్కారులో ఏం జరుగుతుందో చూద్దామని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. జనవరి 16 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగేందుకు అవకాశం ఉందని ప్రస్తావించారు. త్వరలోనే తెలంగాణ భవన్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పారు.