Cyclone Michaung: చెన్నైలో గత 70-80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది: తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపాను
- చెన్నైలో నిన్నటి నుంచి వర్ష బీభత్సం
- అన్ని చర్యలు తీసుకున్నా తుపాను తీవ్రత ముందు అవి సరిపోలేదన్న మంత్రి నెహ్రూ
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'మిగ్జామ్' తుపాను చెన్నై నగరంలో వర్ష బీభత్సం సృష్టించింది. అతి భారీ వర్షాలతో చెన్నై పూర్తిగా జలమయం అయింది. నగరంలో ఎటు చూసినా నీరే. దీనిపై తమిళనాడు పురపాలక శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ స్పందించారు.
నగరంలో గత 70-80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసిందని వెల్లడించారు. తనకు తెలిసినంతవరకు చెన్నై ఇంతటి భారీ వర్షాలను ఎప్పుడూ ఎదుర్కోలేదని తెలిపారు. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ, తుపాను తీవ్రత దృష్ట్యా ఆ చర్యలు సరిపోలేదని వెల్లడించారు. తుపాను విలయం ముందు తమ యంత్రాంగం విఫలమైందని కేఎన్ నెహ్రూ అంగీకరించారు.
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ద్వారా 3 లక్షల మందికి ఆహారం అందిస్తున్నట్టు తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు బోట్లు పంపించామని చెప్పారు. సహాయ చర్యల కోసం 5 వేల మంది సిబ్బందిని ఇతర జిల్లాల నుంచి రప్పించామని వెల్లడించారు.
కాగా, చెన్నైలో కుండపోత వానలు కురుస్తుండడంతో విమానాశ్రయంలోకి నీళ్లు ప్రవేశించాయి. దాంతో మూడు విమానాలను బెంగళూరుకు మళ్లించారు. వరద నీరు ప్రవేశించడంతో 14 రైల్వే సబ్ వేలను అధికారులు మూసివేశారు. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాంబరంలో నీటిలో చిక్కుకుపోయిన 15 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. తుపాను కారణంగా నగరంలోని కోర్టులకు సెలవు ఇచ్చినట్టు మద్రాస్ హైకోర్టు ప్రకటించింది. అటు, చెంగల్పట్టు, తిరువళ్లూర్, కాంచీపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.