ZPM: మిజోరాంలో పూర్తయిన కౌంటింగ్... జెడ్ పీఎమ్ కూటమి విజయం
- నవంబరు 7న మిజోరంలో ఎన్నికలు
- ఇవాళ ఓట్ల లెక్కింపు
- మిజోరం అసెంబ్లీలో మొత్తం స్థానాలు 40
- 27 స్థానాలు గెలిచిన జెడ్ పీఎమ్ కూటమి
మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఆరు పార్టీల కూటమి జొరామ్ పీపుల్స్ మూవ్ మెంట్ (జెడ్ పీఎమ్) విజయం సాధించింది. మిజోరం అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉండగా జెడ్ పీఎం కూటమి 27 చోట్ల విజయం సాధించింది. అధికార ఎంఎన్ఎఫ్ 10, బీజేపీ 2, కాంగ్రెస్ 1 చోట విజయం సాధించాయి.
ఈ ఎన్నికల్లో మిజోరం సీఎం జొరామ్ తంగా ఐజ్వాల్ తూర్పు నియోజకవర్గం-1 నుంచి ఓటమిపాలయ్యారు. మిజోరం అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ 21 స్థానాలు.
మాజీ ఐపీఎస్ అధికారి, ఎంఎల్ఏ లాల్ దుహోమా జెడ్ పీఎమ్ కూటమిని స్థాపించారు. ఈ కూటమిలో మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్, జొరామ్ నేషనలిస్ట్ పార్టీ, జొరామ్ ఎక్సోడస్ మూవ్ మెంట్, జొరామ్ డీసెంట్రలైజేషన్ ఫ్రంట్, జొరామ్ రిఫార్మేషన్ ఫ్రంట్, మిజోరం పీపుల్స్ పార్టీ సభ్యులుగా ఉన్నాయి.
తొలినాళ్లలో ఈ కూటమి సామాజిక సమస్యలపై పోరాడే వేదికగానే ప్రస్థానం ప్రారంభించింది. 2019లో ఈ కూటమికి కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీ గుర్తింపునిచ్చింది. అనతికాలంలోనే అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) పార్టీకి ప్రత్యామ్నాయం అనదగ్గ స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఏకంగా అధికారాన్ని చేజిక్కించుకుంది.