Neeraj Chopra: బౌలింగ్ స్పీడ్ ఎలా పెంచుకోవాలో బుమ్రాకు సలహా ఇచ్చిన నీరజ్ చోప్రా

Neeraj Chopra advised Bumrah on how to increase his bowling speed
  • రన్‌-అప్‌ను మరింత పెంచుకుంటే స్పీడ్ పెరుగుతుందని సూచించిన ‘ఇండియన్ గోల్డెన్ బాయ్’
  • జావెలిన్ త్రోయర్‌గా స్పీడ్ పెంచుకోవచ్చని చెప్పగలనని సలహా
  • వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మానసికంగా పైచేయి సాధించారన్న నీరజ్
టీమిండియా స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యేకమైన బౌలింగ్ శైలిని కలిగివున్నాడు. తక్కువ దూరం నుంచే పరిగెత్తుకొచ్చి బంతులను సంధిస్తుంటాడు. గంటకు 142 కిలోమీటర్ల సగటు వేగంతో బంతులు విసిరి బ్యాట్స్‌మెన్ ను ముప్పుతిప్పలు పెడుతుంటాడు. అయితే బుమ్రా బౌలింగ్ వేగాన్ని మరింత పెంచుకోవచ్చునని ‘గోల్డెన్ బాయ్’, జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా చెబుతున్నాడు. బుమ్రా తన రన్-అప్‌ను మరింత పెంచుకుంటే బౌలింగ్ స్పీడ్ పెరుగుతుందని సలహా ఇచ్చాడు. 

 ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ‘ఐడియాస్ ఎక్స్‌ఛేంజ్‌’ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సలహా ఇచ్చాడు. ‘‘నాకు బుమ్రా అంటే ఇష్టం. అతడి బౌలింగ్ యాక్షన్‌ ప్రత్యేకమైనది. బుమ్రా మరింత వేగం పెంచేందుకు తన రన్-అప్‌ను పెంచుకోవాలని నేను భావిస్తున్నాను. బౌలర్లు మరింత వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వస్తే వారి వేగాన్ని పెంచుకోవచ్చని జావెలిన్ త్రోయర్‌గా తరచుగా చర్చిస్తుంటాను’’ అని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. ఒక జావెలన్ త్రోయర్‌గా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే స్పీడ్ పెరుగుతుందని చెప్పగలనని అన్నాడు. 

ఇక వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మ్యాచ్ ప్రారంభం నుంచి మానసికంగా పైచేయి సాధించారని అన్నాడు. బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మానసికంగా చాలా దృఢంగా కనిపించారని, మొత్తానికి చివరికి భారత్‌పై విజయం సాధించారని అన్నాడు. ఫైనల్ మ్యాచ్‌ను నీరజ్ చోప్రా ప్రత్యక్షంగా వీక్షించిన విషయం తెలిసిందే. ఇదిలావుంచితే.. గాయం కారణంగా దాదాపు 11 నెలలపాటు క్రికెట్‌కు దూరమైన పేసర్ జస్ర్పీత్ బుమ్రా పునరాగమనంలో అదరగొడుతున్నారు. ఐర్లాండ్‌పై టీ20 సిరీస్‌తోపాటు ఆసియా కప్, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్‌లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే.  డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడనున్నారు.
Neeraj Chopra
jasprit Bumrah
Cricket
Team India

More Telugu News