Cyclone Michaung: మిగ్జామ్ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు
- హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణశాఖ
- ములుగు, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
- హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షం
ఆంధ్రప్రదేశ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మిజౌంగ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది.
ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణశాఖ.. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం
హైదరాబాద్ వ్యాప్తంగా ఈ తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. హయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, బేగంపేట, బాలానగర్, కూకట్పల్లి, కొండాపూర్, అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, ఖైరతాబాద్, కోఠి, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, హిమాయత్‌నగర్, అంబర్‌పేట, మల్కాజిగిరిలో వర్షం కురుస్తోంది.