House Blast: పోలీసులపై కాల్పులు జరిపితే ఇల్లు ధ్వంసం.. అమెరికాలో ఘటన.. వీడియో ఇదిగో!
- సెర్చ్ వారెంట్ తో తనిఖీ కోసం వచ్చిన పోలీసులు
- బెదిరించేందుకు ఫ్లేర్ గన్ తో కాల్పులు జరిపిన అనుమానితుడు
- పెలుడుకి ధ్వంసమైన ఇల్లు.. భారీగా ఎగసిపడ్డ మంటలు
సెర్చ్ వారెంట్ తో తనిఖీకి వెళ్లిన పోలీసులపైకి ఓ అనుమానితుడు ఫ్లేర్ గన్ తో కాల్పులు జరిపాడు.. అదికాస్తా బూమ్ రాంగ్ గా మారి పేలుడు సంభవించి తన ఇల్లే ధ్వంసమైంది. ఇంట్లో పేలుడు పదార్థాలు ఉన్నాయో లేక మరేంటో గానీ ఫ్లేర్ గన్ మంటలకు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సినిమా సన్నివేశం తరహాలో ఒకే ఒక్క క్షణంలో ఇల్లు కుప్పకూలింది. భారీగా మంటలు ఎగసిపడడంతో కాలిబూడిదయింది. అమెరికాలోని వర్జినీయా రాష్ట్రం అర్లింగ్టన్ లో చోటుచేసుకుందీ ఘటన.
అర్లింగ్టన్ పోలీసుల కథనం ప్రకారం.. బ్లూమాంట్ ఏరియాలోని ఓ ఇంటిని తనిఖీ చేసేందుకు సెర్చ్ వారెంట్ తో అధికారులు వెళ్లారు. పోలీసులను చూసి అనుమానితుడు ఫ్లేర్ గన్ తో కాల్పులు జరిపాడు. ఇంట్లో పలు రౌండ్లు కాల్పులు జరపడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు ఘటన నేపథ్యంలో చుట్టుపక్కల ఇళ్లల్లోని ప్రజలను అక్కడి నుంచి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అనుమానితుడి పరిస్థితి ఏంటనే విషయంపై స్పష్టత లేదని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని వివరించారు.