Ajay Jadeja: బీసీసీఐ తీరు ఎలా ఉంటుందంటే..: అజయ్ జడేజా
- సెలక్ట్ చెయ్యడంపై కన్నా జట్టులోంచి తొలగించడంపైనే దృష్టి అన్న జడేజా
- ఇషాన్ కిషన్ ను పక్కన పెట్టడంపై మాజీ ఆటగాడి ఫైర్
- ఇలా అయితే ఎలా కుదురుకుంటాడని ప్రశ్నించిన జడేజా
భారత క్రికెట్ జట్టులోకి ఆటగాళ్ల ఎంపికపై కన్నా ఎవరిని తొలగించాలనే విషయంపైనే బీసీసీఐ పెద్దలు దృష్టి పెడతారంటూ టీమిండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా మండి పడ్డారు. ఇప్పుడే కాదు గతంలో కూడా బీసీసీఐ తీరు ఇలాగే ఉందని విమర్శించారు. యువ ఆటగాడు ఇషాన్ కిషాన్ ను పక్కన పెట్టడాన్ని తప్పుబడుతూ జడేజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ 20 ల సిరీస్ లో ఇషాన్ మొదటి మూడు మ్యాచ్ లలో ఆడాడు. ఆ తర్వాత రెండు మ్యాచ్ లకు ఇషాన్ ను పక్కన పెట్టారు.
దీనిని ప్రస్తావిస్తూ.. మూడు మ్యాచ్ లు ఆడిన తర్వాత ఇషాన్ ఇంటికెళ్లిపోయాడు. నిజంగా రెస్ట్ తీసుకోవాల్సినంతగా ఇషాన్ అలసిపోయాడా? అంటూ జడేజా నిలదీశారు. వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఇషాన్ ను తగినన్ని మ్యాచ్ లలో ఆడించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇషాన్ కిషన్ లో ప్రతిభావంతుడైన ఆటగాడు ఉన్నాడని, తనదైన రోజు జట్టును భుజాన మోస్తాడని చెప్పారు. అలాంటి ఆటగాడికి తగినన్ని అవకాశాలు ఇచ్చి జట్టులో కుదురుకునేందుకు తోడ్పడాలని హితవు పలికాడు.
అయితే, బీసీసీఐ తీరు మాత్రం ఆటగాళ్ల సెలక్షన్ పై కాకుండా జట్టులో నుంచి ఎవరిని తప్పించాలా అనే విషయంపైనే ఉంటుందని జడేజా మండిపడ్డారు. నిజానికి ఈ సమస్య ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదని, గతంలోనూ బీసీసీఐ తీరు ఇలాగే ఉందని అజయ్ జడేజా చెప్పారు.