cpi: మా పార్టీతో పొత్తు కాంగ్రెస్కు కలిసి వచ్చింది: కూనంనేని సాంబశివరావు
- బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ ఏమీ చేయలేదని విమర్శలు
- టీడీపీ, సీపీఎం, టీజేఎస్ కాంగ్రెస్కు మద్దతిచ్చాయని వెల్లడి
- పదేళ్లుగా ఏమీ చేయని కేసీఆర్ ఇక ఏం చేయరని ప్రజలు నిర్ణయానికి వచ్చారని వ్యాఖ్య
తమ పార్టీతో పొత్తు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎన్నో నిర్బంధాలు జరిగాయని మండిపడ్డారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఏమీ చేయలేదని విమర్శించారు. అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. అందుకే కేసీఆర్ పాలనకు ముగింపు పలకడానికి టీడీపీ, సీపీఎం, తెలంగాణ జన సమితి మద్దతిచ్చాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించారన్నారు. పదేళ్లుగా ఏమీ చేయలేని కేసీఆర్.. ఇప్పుడు గెలిపిస్తే చేసేదేమీ లేదని ప్రజలు నిర్ణయానికి వచ్చారన్నారు.
కాంగ్రెస్ గెలుపుపై సీపీఐ నారాయణ
కాంగ్రెస్ పార్టీ అందరినీ ఐక్యంగా తీసుకు వెళ్లడంలో విజయం సాధించిందని నారాయణ అన్నారు. కేసీఆర్ పాలనలో టూరిజం శాఖలో వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం మారిందని అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని తగులబెట్టారని ధ్వజమెత్తారు. ఏపీలో పొత్తులపై పార్టీల మధ్య స్పష్టత లేదన్నారు.