Mallikarjun Kharge: సీఎం రేసులో రేవంత్, మల్లు భట్టి, ఉత్తమ్... ఖర్గే సహా ఆ ఏడుగురు ఎవరు ఎవరి పేరును సూచించారంటే...!
- రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపిన రాహుల్, డీకే శివకుమార్, మురళీధరన్
- మల్లు భట్టి పేరును సూచించిన మల్లికార్జున ఖర్గే, దీపాదాస్ మున్షీ, కేకే జార్జ్
- ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు అజయ్ కుమార్, దీపాదాస్ మున్షీ
తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన హైదరాబాద్ వచ్చాక రేవంత్ రెడ్డి పేరును ప్రకటించనున్నారు. అయితే ముఖ్యమంత్రి రేసులో రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు... ఎవరి వైపు ఎవరు మొగ్గు చూపారన్నది ఆసక్తికరంగా వుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం...
రేవంత్ రెడ్డి వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మురళీధరన్‌లు మొగ్గు చూపారు. రాహుల్ గాంధీ... రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపినప్పటికీ పార్టీని దృష్టిలో పెట్టుకొని మల్లు భట్టి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే... మల్లు భట్టి విక్రమార్క వైపు మొగ్గు చూపారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ సీనియర్ నేత దీపాదాస్ మున్షీ, కర్ణాటక మంత్రి కేకే జార్జ్‌లు కూడా మల్లు భట్టి విక్రమార్కను సీఎంగా చేయాలని అభిప్రాయపడ్డారు.
ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు ఝార్ఖండ్ కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ మొగ్గు చూపారు. అలాగే దీపాదాస్ మున్షీ... మల్లు భట్టితో పాటు ఉత్తమ్ కుమార్ పేరును కూడా సూచించారు. దామోదర రాజనర్సింహ పేరును కూడా దీపాదాస్ మున్షీ, కేకే జార్జ్ సూచించారు.