Vizag: వైజాగ్ లో విమాన సర్వీసులకు తుపాను దెబ్బ
- తీరం దాటిన మిగ్జామ్ తుపాను
- ఉత్తర దిశగా పయనం
- విశాఖలో ప్రతికూల వాతావరణం... 23 విమానాల రద్దు
- ఇతర నగరాల నుంచి రావాల్సిన విమానాలు కూడా రద్దు
మిగ్జామ్ తీవ్ర తుపాను ప్రభావం ఏపీలో దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తా వరకు కనిపిస్తోంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో తీవ్ర నష్టం కలుగజేసిన తుపాను... బాపట్ల వద్ద తీరం దాటిన తర్వాత ఉత్తరదిశగా పయనిస్తోంది. ఉత్తరాంధ్రలోనూ ఈ తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ వెల్లడించింది.
తాజాగా, విశాఖపైనా తుపాను ప్రభావం పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖ నుంచి 23 విమాన సర్వీసులు రద్దు చేశారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, ముంబయి, ఢిల్లీ నుంచి వైజాగ్ రావాల్సిన విమానాలు కూడా రద్దయినట్టు విశాఖ ఎయిర్ పోర్టు డైరెక్టర్ వెల్లడించారు.
మరింత సమాచారం కోసం ఎయిర్ లైన్స్ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం విశాఖ ఎయిర్ పోర్టును అత్యవసర సర్వీసుల కోసమే వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అటు, విస్తరణ పనుల దృష్ట్యా విశాఖ విమానాశ్రయంలో రాత్రి 8 గంటల తర్వాత కార్యకలాపాలకు అనుమతించడంలేదు.