Hardik Pandya: హార్దిక్ పాండ్యా కోసం బీసీసీఐ ప్రత్యేక కార్యాచరణ
- వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్
- టీమిండియాకు హార్దిక్ పాండ్యా సేవలు అవసరం అని భావిస్తున్న బీసీసీఐ
- ఎన్సీఏతో కలిసి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించిన బీసీసీఐ
- 18 వారాల పాటు హార్దిక్ పాండ్యాపై పర్యవేక్షణ
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల వరల్డ్ కప్ లో గాయపడిన సంగతి తెలిసిందే. అయితే, హార్దిక్ పాండ్యా వచ్చే ఏడాది జూన్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు ఎంతో అవసరం అని బీసీసీఐ భావిస్తోంది. అందుకే అతడిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది.
ఈ క్రమంలో బీసీసీఐ... బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)తో కలిసి హార్దిక్ పాండ్యా కోసం ప్రత్యేకంగా 18 వారాల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది. వచ్చే ఏడాది జూన్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ కు హార్దిక్ పాండ్యాను పూర్తి ఫిట్ నెస్ తో ఉండేలా చేయడమే ఈ 18 వారాల కార్యాచరణ ముఖ్య ఉద్దేశం.
గతంలో శ్రేయాస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ గాయపడినప్పుడు కూడా, వారికి ఇటువంటి యాక్షన్ ప్లాన్ నే అమలు చేశారు. వారు ముగ్గురూ ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ తో ఉండడమే కాదు, కెరీర్ లో అత్యుత్తమంగా రాణిస్తున్నారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా కోసం కూడా ప్రత్యేక వ్యాయామాలు, ప్రాక్టీసు విధానాలు రూపొందిస్తున్నారు.
కాగా, హార్దిక్ పాండ్యా వచ్చే ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడనున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ పూర్తయ్యాక టీ20 వరల్డ్ కప్ జరిగే అవకాశాలున్నాయి. ఈసారి టీ20 వరల్డ్ కప్ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్నాయి.