Forbes most powerful women list: ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో నలుగురు భారతీయులకు చోటు.. ఎవరెవరంటే..
- 32వ స్థానంలో నిలిచిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- 60వ స్థానంలో రోష్నీ నడార్, 70వ స్థానంలో సోమ మోండల్, 76వ స్థానంలో కిరణ్ మజుందార్ షాలకు చోటు
- మొదటి స్థానంలో నిలిచిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బాస్ క్రిస్టీన్ లగార్డ్
ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో నలుగురు భారతీయులకు చోటు దక్కింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 32వ స్థానంలో నిలిచారు. హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈవో రోష్నీ నడార్ మల్హోత్రా 60వ స్థానంలో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మోండల్ 70వ స్థానంలో, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 76 స్థానంలో నిలిచారు. యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బాస్ క్రిస్టీన్ లగార్డ్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమల్ హారిస్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
కాగా కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ 2019 మే నెలలో పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆమే నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టడానికి ముందు ఆమె యూకేలో అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్, బీబీసీ వరల్డ్ సర్వీస్‌లో కీలక పాత్రలు పోషించారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా సేవలు అందించారు. ఇక హెచ్‌సీఎల్ కంపెనీ వ్యవస్థాపకుడు శివ్ నడార్ కూతురైన రోష్ని నడార్ 2020 జులై నుంచి కంపెనీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. వ్యూహాత్మక అడుగులు వేస్తూ కంపెనీని ముందుకు నడిపిస్తున్నట్టు ఫోర్బ్స్ పేర్కొంది. సెయిల్ చైర్పర్సన్ మోండల్ విషయానికి వస్తే 2021లో ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు. ఆమె నేతృత్వంలో మొదటి ఏడాదిలోనే కంపెనీ లాభాలు ఏకంగా మూడు రెట్లు పెరిగాయి. కంపెనీ చక్కటి ఆర్థిక వృద్ధిని సాధించిందని ఫోర్బ్స్ పేర్కొంది. బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోకాన్ వ్యవస్థాపకురాలైన మజుందార్ షా స్వయంగా ఎదిగిన మహిళల్లో ఒకరని రిపోర్ట్ ప్రశంసించింది.