Hamas: హమాస్ టన్నెల్స్ లోకి కృత్రిమ వరద.. ఇజ్రాయెల్ కొత్త ప్లాన్
- మిలిటెంట్ల ఏరివేతకు ఐడీఎఫ్ ప్రయత్నాలు
- టన్నెల్స్ లోకి నీటిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ కథనం
- గాజాపై ఇప్పటికే బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఊచకోతకు పాల్పడ్డ హమాస్ మిలిటెంట్లను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే గాజాపై బాంబుల వర్షం కురిపించిన ఐడీఎఫ్.. గాజా టన్నెల్స్ లో దాక్కున్న మిలిటెంట్లను బయటకు రప్పించేందుకు మార్గాలు వెతుకుతోంది. బాంబులతో ఉపయోగం లేదని భావించి టన్నెల్స్ ను కృత్రిమ వరదతో నింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం మోటార్లను కూడా సిద్దం చేసినట్లు అమెరికా మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది.
ఈ కథనంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. హమాస్ మిలిటెంట్లు టన్నెల్స్ లో దాక్కుని ఇజ్రాయెల్ బాంబు దాడుల నుంచి రక్షణ పొందుతున్నారు. నెలల తరబడి లోపలే ఉండేందుకు చాలా రోజుల క్రితమే ఏర్పాట్లు చేసుకున్నారు. టన్నెల్ లోకి దిగి దాడులు చేస్తే ఇజ్రాయెల్ బలగాలకే ప్రాణనష్టం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో మిలిటెంట్లను బయటకు రప్పించి, చంపేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది.
టన్నెల్ లోకి నీళ్లను వదిలితే బయటకు రావడం మినహా మిలిటెంట్లకు మరో ప్రత్యామ్నాయం ఉండదని యోచిస్తోంది. అయితే, ఇజ్రాయెల్ బందీలను కూడా టన్నెల్స్ లోనే ఉంచామని మిలిటెంట్లు గతంలో ప్రకటించడంతో ఐడీఎఫ్ వెనకాముందాడుతోందని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.