Ayodhya Ram Mandir: రామమందిరం ప్రారంభోత్సవానికి హాజరు కానున్న సచిన్, కోహ్లీ!
- రామమందిర ప్రారంభోత్సవానికి సచిన్, కోహ్లీలకు ఆహ్వానం అందినట్టు సమాచారం
- జనవరి 22న జరిగే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని
- సుమారు 6 వేల మంది అతిథులకు ఆహ్వానం పంపిన శ్రీరామ మందిర ట్రస్ట్
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి క్రికెట్ దిగ్గజం సచిన్, విరాట్ కోహ్లీ హాజరుకానున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరంలో శ్రీరాముడితో పాటూ ఇతర దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. రామమందిరం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ప్రధానితో పాటూ సాధువులు, పూజారులు, రాజకీయ నాయకులు సహా మొత్తం 6 వేల మందికి శ్రీరామ జన్మభూమి ట్రస్టు ఆహ్వానం పంపింది.
అయితే, రామమందిర ప్రారంభోత్సవం తరువాత జనవరి 25న ఇంగ్లండ్తో టీమిండియా టెస్టు సరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు హైదరాబాద్లో నిర్వహించనున్న నేపథ్యంలో రామమందిర కార్యక్రమం తరువాత వెంటనే కోహ్లీ హైదరాబాద్కు తిరిగి రావాల్సి ఉంటుంది.
అయోధ్యలో మొత్తం 8.64 ఎకరాల్లో విస్తరించిన రామమందిరంలో ఐదు మండపాలు ఉన్నాయి. గర్భగుడితో పాటూ గుధ్ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపాన్ని నిర్మించారు.