Pranab Mukherjee: రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలపై నా తండ్రికి సందేహాలు: ప్రణబ్ ముఖర్జీ కుమార్తె
- తన తండ్రి మనోగతం ఆధారంగా ప్రణబ్ ముఖర్జీ కుమార్తె ‘ఇన్ ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్’ పుస్తకం
- డిసెంబర్ 11న ప్రణబ్ పుట్టిన రోజున పుస్తకావిష్కరణ
- పుస్తకంలోని ఆసక్తికర అంశాలను మీడియాతో పంచుకున్న ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ
- రాహుల్ గాంధీ నాయకత్వంపై తన తండ్రికి సందేహాలుండేవని వెల్లడి
ఇటీవలి మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో రాహుల్ గాంధీ గురించి దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ప్రణబ్ అభిప్రాయాలను ఆయన కుమార్తె శర్మిష్ఠ తన తాజా పుస్తకం ‘ఇన్ ప్రణబ్, మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్’ పుస్తకంలో పంచుకున్నారు. తన డైరీలో ప్రణబ్ రాసుకున్న విషయాలు, తనతో పంచుకున్న విషయాలను శర్మిష్ఠ ఈ పుస్తకంలో ప్రస్తావించారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ పుస్తకంలోని పలు విషయాలను ఆమె మీడియాకు తెలిపారు.
ప్రణబ్‌కు రాహుల్ నాయకత్వ లక్షణాలపై సందేహాలు ఉండేవని శర్మిష్ఠ పేర్కొన్నారు. రాహుల్ ఇంకా రాజకీయ పరిణతి సాధించాల్సి ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డట్టు పుస్తకంలో రాశారు. రాహుల్‌కు రాజకీయాలు తగవేమోనని కూడా తండ్రి తనతో ఓమారు అన్నట్టు ఆమె వెల్లడించారు.
2004లో కాంగ్రెస్ విజయం, ప్రధాని పదవిపై సోనియా గాంధీ విముఖత, మన్మోహన్ సింగ్‌ను పీఎం పదవి వరించడం, తనకు ఆ పదవి దక్కకపోవడంపై ప్రణబ్ తన డైరీలో రాసుకున్న విషయాలనూ శర్మిష్ఠ పంచుకున్నారు. తండ్రికి పీఎం పదవిపై ఆసక్తి ఉన్నా ఆ కల సాకారం కాదని తెలిసి రాజీపడ్డారని ఆమె చెప్పుకొచ్చారు. డిసెంబర్ 11న ప్రణబ్ జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.