Bhatti Vikramarka: సీఎం పదవిపై తొలిసారి స్పందించిన భట్టి
- పదవి ఆశించిన మాట నిజమేనని వెల్లడి
- అందరికీ పదవులు అసాధ్యమన్న సీనియర్ నేత
- పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసిన భట్టి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీలో సీనియర్ నేతలు చాలామంది సీఎం పోస్టు కోసం ఆసక్తి చూపించారు. రేసులో తాము కూడా ఉన్నట్లు మీడియా ముందు ప్రకటనలు చేశారు. అయితే, హైకమాండ్ మాత్రం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క పేరు సీఎం పదవికి పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క తొలిసారిగా స్పందించారు.
ముఖ్యమంత్రి పదవిని ఆశించిన విషయం నిజమేనని భట్టి విక్రమార్క చెప్పారు. అయితే, అందరికీ పదవులు దక్కడం అసాధ్యమని ఆయన చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని పార్టీ హైకమాండ్ ఎంపిక చేసిందని గుర్తుచేశారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ విషయంపై పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని వివరించారు. కాగా, మల్లు భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎంగా పార్టీ హైకమాండ్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే.