Vishnu Vardhan Reddy: మహ్మద్ ప్రవక్త సూచనలు ఆచరించేవారు విగ్రహారాధన చేయరు: విష్ణువర్ధన్ రెడ్డి
- అనంతపురంలో విగ్రహం గొడవ
- వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటుకు బీజేపీ దరఖాస్తు
- ఇంతలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన వైసీసీ నేతలు!
- ఎవరి విగ్రహం ఏర్పాటు చేయాలో ప్రజలే చెబుతారన్న విష్ణువర్ధన్ రెడ్డి
ఇటీవల కొందరు వ్యక్తులు టిప్పు సుల్తార్ విగ్రహం పెడతామంటూ బయల్దేరారని, అది రాజకీయం కోసం ప్రజల మధ్య చిచ్చు రేపేందుకు చేస్తున్న ప్రయత్నమేనని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
మహ్మద్ ప్రవక్తను అనుసరించేవారు కానీ, టిప్పు సుల్తాన్ ను అభిమానించేవాళ్లు కానీ విగ్రహారాధన చేయరని తెలిపారు. మరి సిద్ధాంతపరంగా విగ్రహారాధనను వ్యతిరేకించే ఓ వర్గానికి చెందిన వ్యక్తులు ఇప్పుడు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారంటే దీని వెనుకున్న రాజకీయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
"మేం సమాజంలో హిందువులను, ముస్లింలను, క్రిస్టియన్లను అందరినీ గౌరవిస్తాం. ఉద్దేశపూర్వకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. విగ్రహాన్ని పెట్టాలని ప్రయత్నిస్తున్న వైసీపీ పెద్దలకు ఒక విషయాన్ని చెప్పదలచుకున్నాను. రాజకీయాలు మానుకోండి... ప్రజల వద్దకు వెళదాం... ఎవరి విగ్రహం ఏర్పాటు చేయాలో ప్రజలే చెబుతారు" అంటూ స్పష్టం చేశారు.
అనంతపురంలో బీజేపీ నేతలు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోగా, ఇంతలో వైసీపీ నేతలు టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారంటూ విష్ణువర్ధన్ రెడ్డి మండిపడుతున్నారు.