Brian Lara: నా రెండు రికార్డులు బద్దలు కొట్టే సత్తా అతడొక్కడికే ఉంది: బ్రియాన్ లారా
- క్రికెట్ చరిత్రలో లారా పేరిట గొప్ప రికార్డులు
- టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్ లో 400* పరుగులు చేసిన లారా
- కౌంటీ క్రికెట్ లో ఓ ఇన్నింగ్స్ లో 501 పరుగులు చేసి అజేయంగా నిలిచిన వైనం
- తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన రికార్డుల ప్రస్తావన తెచ్చిన లారా
ప్రపంచ క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా ఓ ఆణిముత్యం. క్లాస్ కు, స్టయిలిష్ బ్యాటింగ్ కు పర్యాయ పదం లారానే. టెస్టుల్లోనూ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోనూ లారా నమోదు చేసిన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు, దేశవాళీ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు... ఈ రెండు రికార్డులు లారా పేరిటే ఉన్నాయి.
2003-04 సీజన్ లో ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్ లో పర్యటించిన సమయంలో లారా నాలుగో టెస్టులో ఓ ఇన్నింగ్స్ లో 400 (నాటౌట్) పరుగులు చేయడం అప్పట్లో ప్రపంచ క్రికెట్ ను అబ్బురపరిచింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఏకైక క్వాడ్రాఫుల్ సెంచరీ అదొక్కటే. అంతకుముందు, 1994లో ఇంగ్లండ్ లో కౌంటీ క్రికెట్ ఆడిన లారా వార్విక్ షైర్ కు ప్రాతినిధ్యం వహిస్తూ... డుర్హామ్ జట్టుపై తానొక్కడే 501 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
తాజాగా ఆనంద్ బజార్ పత్రిక మీడియా సంస్థతో లారా మాట్లాడుతూ తన అద్భుత రికార్డుల విషయాన్ని ప్రస్తావించాడు. తన రికార్డులు బద్దలు కొట్టే సత్తా ఉన్న బ్యాట్స్ మన్ ఎవరో వెల్లడించాడు.
"శుభ్ మాన్ గిల్ నా రెండు రికార్డులను బ్రేక్ చేయగలడు. ఈ తరం ఆటగాళ్లలో గిల్ అత్యంత ప్రతిభావంతుడైన బ్యాట్స్ మన్. క్రికెట్ ప్రపంచాన్ని అతడు చాలాకాలం పాటు ఏలే అవకాశం ఉంది. గిల్ కౌంటీ క్రికెట్ ఆడితే నా 501 (నాటౌట్) పరుగుల రికార్డు బద్దలు కొడతాడు, టెస్టు క్రికెట్ లోనూ నా 400 (నాటౌట్) పరుగుల రికార్డును తిరగరాస్తాడు. నా మాటలు గుర్తుపెట్టుకోండి... భవిష్యత్తులో గిల్ టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తాడు.
ఇటీవల వరల్డ్ కప్ లో సెంచరీ చేయలేకపోవవచ్చు... కానీ అప్పటికే అతడు అన్ని ఫార్మాట్లలో సెంచరీలు నమోదు చేశాడన్న విషయం గమనించాలి. వన్డేల్లోనూ డబుల్ సెంచరీ అతడి సొంతం. ఐపీఎల్ లోనూ అనేక మ్యాచ్ లను గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ తన కెరీర్ లో అనేక ఐసీసీ టోర్నీలు గెలుస్తాడు" అని లారా ప్రశంసల వర్షం కురిపించాడు.