sridhar babu: ఆ రెండు గ్యారెంటీలు తొలుత అమలు చేస్తాం... ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియాలి: మంత్రి శ్రీధర్ బాబు
- కేబినెట్ భేటీలో ఆరు గ్యారంటీలపై చర్చించినట్లు వెల్లడి
- విద్యుత్‌కు సంబంధించి తొమ్మిదేళ్లుగా ప్రణాళికాబద్ధంగా జరగలేదని వ్యాఖ్య
- తొమ్మిదేళ్లలో ఖర్చు చేసింది ఎంత? ప్రజలకు చేరింది ఎంత? తెలియాలన్న శ్రీధర్ బాబు
ఈ నెల 9న ఆరు గ్యారెంటీలలో రెండుంటిని అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు తెలియజేయాల్సి ఉందన్నారు. గురువారం కేబినెట్ భేటీ అనంతరం శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... డిసెంబర్ 9వ తేదీ నుంచి రెండు గ్యారెంటీలను అమలు చేయడంపై కేబినెట్లో చర్చ జరిగిందని వెల్లడించారు. కేబినెట్ భేటీలో ఆరు గ్యారెంటీలపై సుదీర్ఘ చర్చ సాగిందని, గ్యారెంటీల అమలుకు వనరుల సేకరణ కోసం ప్రతి అంశంపై దృష్టి సారించామన్నారు.
ప్రధానంగా రెండు గ్యారెంటీలను అమలు చేయాల్సి ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా అమలు చేస్తామన్నారు. ఈ అమలుకు సంబంధించి అధికారులతో రేపు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌పై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అన్ని విభాగాలకు సంబంధించి అధికారుల నుంచి వివరాలు కోరినట్లు తెలిపారు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు జరిగిన ఆర్థిక వ్యవహారాలను ప్రజలకు తెలియజేయాల్సి ఉందన్నారు. విద్యుత్‌కు సంబంధించి గత తొమ్మిదేళ్లుగా ప్రణాళికాబద్ధంగా జరగలేదన్నారు. గత తొమ్మిదేళ్లుగా ఎంత ఖర్చు చేసింది? ప్రజలకు ఎంత చేరింది? తెలియాల్సి ఉందన్నారు. త్వరలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. మంత్రి వర్గ కూర్పు అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.