Canada: కెనడాలో వీసా నిబంధనలు మరింత కఠినం!
- విద్యార్థుల కాస్ట్ ఆఫ్ లివింగ్ ఖర్చుల కేటాయింపు రెట్టింపు
- కెనడాలో పెరిగిన వ్యయాలకు అనుగుణంగా మార్పులు చేశామన్న ప్రభుత్వం
- ఇక ఏటా ఈ మొత్తంలో మార్పులు ఉంటాయని వెల్లడి
కెనడాలో జీవన వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విదేశీ విద్యార్థుల నిబంధనలు మరింత కఠినతరం చేసింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ నిబంధన కింద విదేశీ విద్యార్థులు కనీసం 15,181 డాలర్లు సిద్ధం చేసుకోవాలని తేల్చి చెప్పింది. విద్యార్థుల ట్యూషన్, ప్రయాణాల ఖర్చులకు ఇది అదనమని వివరించింది. గతంలో ఈ మొత్తం 7,357 డాలర్లుగా ఉండేది. 2000లో చివరిసారిగా ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ నిబంధనల్లో మార్పులు చేశారు.
కాలం గడిచే కొద్దీ కెనడాలో జీవన వ్యయాలు పెరుగుతున్నాయని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు కాస్ట్ ఆఫ్ లివింగ్ నిబంధనల్లో మార్పులు లేకపోవడంతో కెనడాకు వచ్చాక విదేశీ విద్యార్థులు తమ వద్ద ఉన్న నిధులు సరిపోక ఇబ్బందులు పడుతున్నారని వివరించింది. కెనడాలోని విదేశీ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదన్నదే తమ ఉద్దేశమని చెప్పింది. విదేశీ విద్యార్థులను ఆహ్వానించడంతో పాటూ వారికి ఇబ్బందులు లేకుండా చూడటం కూడా తమ బాధ్యతని తెలిపింది. ఇకపై ఏటా కాస్ట్ ఆఫ్ లివింగ్ నిబంధనలో అప్పటి ఖర్చుల మేరకు మార్పులు చేస్తామని పేర్కొంది. వచ్చే ఏడాది సెమిస్టర్‌కు మునుపు, వీసాల జారీని తగ్గించడంతో పాటూ ఇతర చర్యలను చేపట్టబోతున్నట్టు పేర్కొంది. తద్వారా, కెనడా యూనివర్సిటీలు తమ వద్ద చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించగలవని తెలిపింది.