Team India: క్రాస్‌రోడ్స్‌లో టీమిండియా... కోహ్లీ, రోహిత్ వర్సెస్ యువ ఆటగాళ్లు!
- 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20లు ఆడని రోహిత్, కోహ్లీ
- అప్పటి నుంచి డజను మంది యువ ఆటగాళ్లకు జట్టులో చోటు
- సత్తా చాటుతూ జట్టులో స్థానాన్ని పదిలపరుచుకుంటున్న యువకెరటాలు
- సీనియర్లా?.. జూనియర్లా?.. ఎటూ తేల్చుకోలేకపోతున్న సెలక్టర్లు
- సౌతాఫ్రికా టూర్తోనే ప్రయోగాలు మొదలు
విరాట్ కోహ్లీ, రోహిత్‌శర్మ.. ఇండియన్ క్రికెట్‌కి దశాబ్దాలుగా వీరు అందిస్తున్న సేవలు అసామాన్యం. 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి తర్వాత వీరిద్దరూ టీ20లకు దూరమయ్యారు. వీరిద్దరి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం లభిస్తోంది. జట్టులో కదం తొక్కుతున్న యువ ఆటగాళ్లు అపురూప విజయాలు అందిస్తున్నారు. నిరుడు న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను చేజిక్కించుకున్నారు. ఆసియా క్రీడల్లో భారత యువ జట్టు స్వర్ణం గెలుచుకుంది. తాజాగా ఆస్ట్రేలియాను 4-1తో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్‌లలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ తప్పకుండా ఆడతారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే, 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టులోకి దాదాపు డజను మంది యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. వీరిలో రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, రింకు సింగ్, తిలక్ వర్మ తదితరులు ఉన్నారు. వీరందరూ అద్భుతంగా రాణిస్తున్నారు. అంతేకాదు, వీరి వయసు కూడా 26 ఏళ్ల లోపే.
సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టు కూడా యువరక్తంతో తొణికిసలాడుతోంది. ఐపీఎల్లో ఆకట్టుకున్న సాయి సుదర్శన్‌కు కూడా జట్టులో స్థానం లభించింది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టు సిరీస్ మాత్రమే ఆడనున్నారు. మరోవైపు, వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో జట్టును పూర్తిగా సన్నద్ధం చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అయితే, కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్ ఆటగాళ్లతో జట్టును మిళితం చేస్తారా? లేదంటే, పూర్తిగా యువ ఆటగాళ్లనే బరిలోకి దింపాలా? అన్న దానిపై సెలక్టర్లలో తర్జన భర్జన మొదలైంది. ఈ డైలమాకు తెరదించేందుకు సౌతాఫ్రికా టూర్ నుంచే ప్రయోగాలు మొదలుపెట్టాలని యోచిస్తున్నారు.