Chandrababu: ఇవాళ నేను పర్యటిస్తున్నానని తెలిసి జగన్ బయటికొచ్చారు: చంద్రబాబు
- ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంటల పరిశీలన
- పంట నష్టపోయిన రైతులతో మాట్లాడిన టీడీపీ అధినేత
- ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని సీఎం అంటూ ఎద్దేవా
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రైతుల సమస్యలను ప్రత్యక్షంగా వీక్షించారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరులో మిగ్జామ్ తుపానుతో నష్టపోయిన పంటపొలాలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. తుపానుతో పంట నష్టపోయి రైతులు కన్నీరు పెడుతుంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బాధ్యతరాహిత్యంగా వ్యవహరించటం సిగ్గుచేటని మండిపడ్డారు.
"తెనాలి నియోజకవర్గంలో వరి, అరటి, మినుము, పెసలు వంటి పంటలు దెబ్బతిన్నాయి. 30 వేల ఎకరాల్లో 80 శాతం పంట నష్టం జరిగింది. వేమూరు నియోజకవర్గంలో 90 వేల ఎకరాల్లో పంట సాగుచేస్తే 90 శాతం పంట నష్టపోయారు. వరి అంతా నేలకొరిగింది. ఎకరాకు రూ.50 వేలు ఖర్చు చేశారు, ఇవాళ ప్రతి రైతు కంట కన్నీరే! ఇంత వరకు అధికారులు ఎవరైనా వచ్చారా? ముఖ్యమంత్రి భూమ్మీద తిరగకుండా ఆకాశంలో తిరుగుతున్నారు.
టీడీపీ హయాంలో ఎప్పటికప్పుడు పంటకాలువల్లో పూడిక తీశాం. కానీ నేడు ఎక్కడైనా పంటకాలువల్లో పూడిక తీశారా? డ్రెయిన్స్ శుభ్రం చేశారా? మురుగునీరు పొలాల్లోకి వెళ్లి పొలాలు మునిగిపోతున్నాయి. జూలైలో అందరూ నారు మళ్లు వేశారు, కానీ ప్రభుత్వం నీళ్లివ్వకపోయినా కష్టపడి పంట నిలుపుకున్నారు చేతికొచ్చిన పంట తుపాను దాటికి నేలపాలైంది. జగన్ రెడ్డికి బంగాళ దుంపలకు, ఉల్లిగడ్డలకు తేడా తెలియదు. పొటాటో అంటే ఏంటని రైతుల్ని అడుగుతున్నారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా? జగన్ రెడ్డికి తప్పుడు పనులు చేయటం తప్ప ఇంకేం తెలియదు.
రేపల్లెలో లక్ష ఎకరాల్లో పంట సాగు చేస్తే 60 వేల ఎకరాల్లో నష్టం జరిగింది. బాపట్లలో 45 వేల ఎకరాలు సాగు చేస్తే 45 వేల ఎకరాలు నష్టపోయింది. ఒక్క ఈ ప్రాంతంలోనే ఇన్ని వేల ఎకరాల్లో నష్టం వాటిల్లిందంటే ఇక రాష్ట్రం మొత్తం ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లి ఉంటుంది?
హుద్ హుద్ తుపాను సమయంలో తుపాను కంటే ముందుగా నేను విశాఖ వెళ్లి అక్కడి ఉండి పరిస్ధితులు చక్కదిద్దా. కేంద్రంతో మాట్లాడి రెండో రోజు ప్రధానిని రప్పించాను. కేంద్రం కొంత సాయం అందించింది. కానీ నేడు ఈ ప్రభుత్వం కనీసం కేంద్ర బృందాన్ని కూడా పిలువలేదు. వైసీపీ మంత్రులు సాధికార యాత్ర అంటూ తిరుగుతున్నారు. వాళ్ల మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప కూడా దాటడం లేదు.
జగన్ రెడ్డి అందర్నీ తన కోసం పనిచేసే బానిసలు అనుకుంటున్నారు. అంత అహంకారం ప్రజాస్వామ్యంలో పనికొస్తుందా? నాలుగున్నరేళ్లలో ప్రజలకు ఆయన చేసిందేంటి? ఫసల్ బీమాను నిర్వీర్యం చేశారు. ప్రతి సంవత్సరం బీమా ఇస్తున్నామంటున్నారు. మీలో ఎవరికైనా ఆ డబ్బులు వచ్చాయా?
విపత్తులు వచ్చినపుడే ప్రభుత్వ పనితనం బయటపడుతుంది. మిగ్జామ్ తుపానుతో వైసీపీ చేతకానితనం వెల్లడైంది. తుపాను వస్తుందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేదు, నేడు నేనొస్తున్నానని తెలిసి చిరిగిపోయిన సంచులు ఇస్తున్నారు. నేను పర్యటనకు వస్తున్నానని తెలిసే ముఖ్యమంత్రి ఇవాళ బయటకొచ్చారు. ప్రతిపక్షం కంటే అధికార పక్షం బాధ్యతాయుతంగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారు.
టీడీపీ హయాంలో వరికి నష్టపరిహారం హెక్టారుకు రూ. 20 వేలిస్తే నేడు రూ.15 వేలకు తగ్గించారు. ఎరువు ధరలు, ట్రాక్టర్ ఖర్చులు పెరిగాయి. హెక్టారుకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఇవ్వాలి. ఈ ముఖ్యమంత్రి ఇవ్వకపోతే మరో 3 నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుంది. నష్టపోయిన వారందరినీ ఆదుకుంటాం. ప్రజల్లో చైతన్యం రావాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి.
మీరు నాపై చూపించిన అభిమానాన్ని మర్చిపోను, మీ రుణం తీర్చుకుంటా. మీ అందరి సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడతా" అంటూ చంద్రబాబు రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.