IT Raids: విజయవాడలో ఐటీ దాడులు.. బంగారం వర్తకుల్లో గుబులు
- రెండు రోజులుగా నగరంలోని షాపులలో అధికారుల సోదాలు
- షట్టర్స్ క్లోజ్ చేసి, సిబ్బందిని బయటకు పంపించిన అధికారులు
- రెండు షాపుల్లో బంగారం అక్రమ రవాణా, పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తింపు
విజయవాడలో రెండు రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. సిటీలోని బంగారం షాపులు, షోరూంలలో అధికారులు గంటల తరబడి అమ్మకాలు, కొనుగోళ్ల లెక్కలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా రెండు ప్రముఖ దుకాణాలలో బంగారం అక్రమ రవాణా, పన్ను ఎగవేతలు జరిగాయని గుర్తించినట్లు సమాచారం. దీంతో అధికారులు బృందాలుగా విడిపోయి కేంద్ర బలగాల సాయంతో సోదాలు చేస్తున్నారు. ఆయా షోరూంలలో సేల్స్ క్లోజ్ చేసి, సిబ్బందిని బయటకు పంపించి మరీ తనిఖీలు చేస్తున్నారు. అకౌంటెంట్లు, మేనేజర్ల సమక్షంలో సంస్థల అకౌంట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు.
బాంబే జువెల్లర్స్ తో పాటు ఆంజనేయ జువెలర్స్ షోరూమ్‌లలో ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఈ రెండు షోరూమ్‌లలో నిర్వాహకులు బంగారం అక్రమ రవాణా, పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణలో హైదరాబాద్‌కు చెందిన జువెల్లర్ సంస్థల పాత్ర కూడా ఉందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో మరో రెండు రోజుల పాటు సోదాలు జరిగే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. దీంతో నగరంలోని బంగారం వర్తకుల్లో గుబులు రేగుతోంది.