Chandrababu: తుపాను బాధితులకు ప్రభుత్వం రూ.25 వేలు ఇవ్వాలి: చంద్రబాబు
- బాపట్ల జిల్లాలో తుపాను విలయం
- నేడు బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన
- చంద్రబాబు ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్న గిరిజనులు
- ఆదుకునేందుకు ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదని వెల్లడి
- బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పిన చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాలను పరిశీలించారు. బాపట్ల జమ్ములపాలెంలోని ఎస్టీ కాలనీలో గిరిజనుల పరిస్థితిని చూసి విచారం వ్యక్తం చేశారు.
తుపాను వల్ల సర్వం కోల్పోయామని గిరిజనులు చంద్రబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేక నాలుగు రోజులు చీకట్లోనే గడిపామని తెలిపారు. కాలనీలో రహదారి లేక రోజుల తరబడి బురదలోనే తిరిగామని వాపోయారు. తమను ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదని చంద్రబాబుకు వివరించారు.
వారి సమస్యలను ఎంతో ఓపిగ్గా విన్న చంద్రబాబు... తాము అధికారంలోకి వచ్చాక అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ ఎస్టీ కాలనీ వాసులకు చంద్రబాబు నిత్యావసరాలతో కూడిన కిట్లు పంపిణీ చేశారు.
అంతేకాదు, టీడీపీ తరఫున ఒక్కో ఇంటికి రూ.5 వేలు అందిస్తున్నామని వెల్లడించారు. తుపాను బాధితులకు ప్రభుత్వం రూ.25 వేలు ఆర్థికసాయం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.