Nara Lokesh: తుని నియోజకవర్గంలో యువగళం... పెరుమాళ్లపురంలో మత్స్యకారులతో లోకేశ్ సమావేశం

Nara Lokesh held meeting with fishermen in Perumallapuram

  • ఇటీవల తుపాను కారణంగా నిలిచిన యువగళం
  • నేడు పిఠాపురం నియోజకవర్గంలో పునఃప్రారంభం
  • పెరుమాళ్లపురం వద్ద తుని నియోజకవర్గంలోకి ప్రవేశం
  • లోకేశ్ కు ఘనస్వాగతం పలికిన టీడీపీ, జనసేన శ్రేణులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మళ్లీ షురూ అయింది. తుపాను కారణంగా నిలిచిపోయిన పాదయాత్ర ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలోని శీలంవారి పాకలు జంక్షన్ నుంచి ప్రారంభమైంది. అనంతరం పాదయాత్ర తుని నియోజకవర్గంలోకి ప్రవేశించింది. తొండంగి మండలం పెరుమాళ్లపురం వద్ద లోకేశ్ కు ఘనస్వాగతం లభించింది. టీడీపీ, జనసేన కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు. 

పెరుమాళ్లపురం వద్ద లోకేశ్ స్థానిక మత్స్యకారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారులు తమ సమస్యలను లోకేశ్ కు వివరించారు. వేటకు వెళ్లి చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, వేటకు వెళ్లి చనిపోతే డాక్టర్ సర్టిఫికెట్ అడుగుతున్నారని తెలిపారు. తమకు ఉపాధి కల్పించే వలల ధరలు బాగా పెరిగిపోయాయని, అధికారంలోకి వచ్చాక వలల ధరలు తగ్గేలా చూడాలని లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు. 

వారి పరిస్థితులు తెలుసుకున్న లోకేశ్ తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రికి ఉల్లిగడ్డకు, బంగాళాదుంపకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఇలాంటి సీఎం వచ్చి రైతుల కష్టాలు ఏం తీర్చుతారు? అంటూ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

మత్స్యకారుడు చనిపోతే 30 రోజుల్లో పరిహారం అందజేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. విద్యుత్ చార్జీలు తగ్గించి పేద కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే కాలుష్యం కలిగించని పరిశ్రమలు తీసుకువస్తామని వివరించారు. తీర ప్రాంతాల్లో సముద్రంలో కలిసే నీటిని శుద్ధి చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News