Amit Shah: మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక కొనసాగుతున్న వేళ అమిత్ షా ఆసక్తికర పోస్ట్
- ఎల్లప్పుడూ మెరుగైన దానికోసం చూడాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షా పోస్ట్
- మంచి కదలిక కోసం స్థిరపడిపోవద్దంటూ బీజేపీ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్య
- 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సస్పెన్స్ కొనసాగుతున్నవేళ ఆసక్తికరంగా మారిన బీజేపీ అగ్రనేత పోస్ట్
ఇటీవలే వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించింది. మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు వారం కావస్తున్నా ఆ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరనేదానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సీఎంల ఎంపిక బీజేపీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఎడతెగని చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరంగా స్పందించారు.
‘‘మంచి కదలిక కోసం స్థిరపడిపోకండి. ఎల్లప్పుడూ మెరుగైన దానికోసం చూడండి’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అమిత్ షా ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశారు. తన మనవరాళ్లతో చెస్ ఆడుతున్న ఒక ఫొటోని ఈ పోస్ట్‌కి జోడించారు. ఈ ఫొటో అమిత్ షా కుటుంబ ఆప్యాయతలను తెలియజేస్తున్నప్పటికీ.. ఆయన ఇచ్చిన క్యాప్షన్ ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారోనంటూ చర్చ జరుగుతోంది. ఇదిలావుండగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించడంలో జాప్యంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నాయి. కీలకమైన ఈ రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పదవులు చేపట్టబోయేది ఎవరనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ఆదివారం లేదా సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.