Shah Rukh Khan: షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లకు కోర్టు నోటీసులు
- పొగాకు ఉత్పత్తుల కంపెనీల ప్రకటనల్లో నటించడమే కారణం
- అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌కు వెల్లడించిన డిప్యూటీ సొలిసిటర్ జనరల్
- కేసులో తదుపరి విచారణ మే 9, 2024కి వాయిదా
ప్రకటనల్లో నటించడం ద్వారా పొగాకు ఉత్పత్తుల కంపెనీలకు మద్దతు ఇచ్చారంటూ బాలీవుడ్ అగ్ర హీరోలు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లకు కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) అక్టోబర్ 20న ఈ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌కు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే తెలియజేశారు. కోర్టు ధిక్కార పిటిషన్‌పై వివరణ ఇస్తూ ఈ సమాధానం ఇచ్చారు.
ప్రజారోగ్యానికి హానికరమైన కొన్ని ఉత్పత్తులు లేదా వస్తువుల ప్రకటనల్లో సెలబ్రిటీలు, ముఖ్యంగా 'పద్మ అవార్డు గ్రహీతలు' పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని సవాలు చేస్తూ మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా సెప్టెంబరు 2022 నాటి నోటీసులపై స్పందించకపోవడంతో 2023 ఆగస్టులో కేబినెట్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి కోర్టు ధిక్కార నోటీసులు జారీ అయ్యాయి. దీనికి తాజాగా సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే వివరణ ఇచ్చారు. పొగాకు కంపెనీల ఉత్పత్తుల్లో నటించిన నటులకు నోటీసులు జారీ అయ్యాయని కోర్టుకు వివరించారు.
అక్టోబర్ 20న షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయని జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్ ధర్మాసనానికి చెప్పారు. కాగా అమితాబ్ బచ్చన్ తన కాంట్రాక్టును రద్దు చేసుకున్నప్పటికీ తన ప్రకటనను ప్రదర్శించినందుకు పొగాకు కంపెనీకి లీగల్ నోటీసు పంపారని ప్రస్తావించారు. ఈ కేసుపై తదుపరి విచారణ మే 9, 2024కి వాయిదా పడిందని వెల్లడించారు.