Telangnana Inter Exams: ఈసారి 15 రోజుల ముందుగానే ఇంటర్ పరీక్షలు.. కారణం ఇదే!
- సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం
- విద్యాశాఖమంత్రి దామోదర రాజనర్సింహ అనుమతే తరువాయి
- ఇంటర్ పరీక్షలు ముగిసిన వెంటనే పదో తరగతి పరీక్షల నిర్వహణ
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంటర్ ఫలితాలను ఈసారి ముందుగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. సాధారణంగా ఇంటర్ పరీక్షలు మార్చి మధ్యలో నిర్వహిస్తారు. ఆ తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, ఈసారి అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడం, అధికారులు ఇతర పనుల్లో బిజీగా ఉండే అవకాశం ఉంది. దీంతో పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
దీనికితోడు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. ఇంటర్ పరీక్షలను ముందుగానే నిర్వహించడం వల్ల విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌కు సన్నద్ధం కావడానికి సమయం ఉంటుంది. ఇంటర్ పరీక్షలు ముగిశాక అదే నెల 12న లేదంటే 14 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. అలాగే, ఫిబ్రవరి 26 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఇవన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మార్చి 1 నుంచే ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సమాయత్తం అవుతోంది. దామోదర రాజనరసింహ నిన్ననే విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అనుమతి తర్వాత పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా వెల్లడిస్తారు.