Nara Lokesh: మరో మూడు నెలల్లో ప్రజల ప్రభుత్వం ఏర్పడబోతోంది: నారా లోకేశ్
- తుని నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
- శృంగవృక్షంలో కాకినాడ సెజ్ రైతులతో సమావేశం
- పరిశ్రమలు వస్తే గ్రామాలు బాగుపడతాయన్న లోకేశ్
- తాము తెచ్చిన పరిశ్రమలను వైసీపీ సర్కారు తరిమేసిందని ఆరోపణ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేడు తుని నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేశ్ శృంగవృక్షంలో కాకినాడ సెజ్ రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరో మూడు నెలల్లో ప్రజల ప్రభుత్వం ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి మళ్లీ పరిశ్రమలను తీసుకువస్తామని, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.
టీడీపీ ప్రభుత్వ పాలనలో కియాను తీసుకువచ్చామని, ఈ పరిశ్రమ వల్ల వేలాది మంది జీవితాలు మారిపోయాయని లోకేశ్ చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ల పరిశ్రమ తీసుకువచ్చానని, ఆ పరిశ్రమతో 6 వేల మంది ఉపాధి పొందారని వెల్లడించారు.
తాము తీసుకువచ్చిన పలు పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం తరిమేసిందని లోకేశ్ మండిపడ్డారు. పరిశ్రమలు వస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, అందుకే రాష్ట్రంలో పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.