Pro-tem Speaker: ఎంఐఎంను మచ్చిక చేసుకోవడానికే ప్రొటెం స్పీకర్ పదవి ఇచ్చారు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
- తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ
- అత్యంత సీనియారిటీ ఉన్న ఎమ్మెల్యేనే ప్రొటెం స్పీకర్ గా నియమించాలన్న లక్ష్మణ్
- కానీ సీనియారిటీ పట్టించుకోకుండా ప్రొటెం స్పీకర్ ఎంఐఎంకు ఇచ్చారని ఆగ్రహం
- ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో రాజకీయం ఉందని విమర్శలు
తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడం పట్ల బీజేపీ మండిపడుతోంది. ఎంఐఎంను మచ్చిక చేసుకోవడానికే కాంగ్రెస్ ప్రొటెం స్పీకర్ పదవిని కబ్టబెట్టిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు.
ప్రొటెం స్పీకర్ గా అత్యంత సీనియారిటీ ఉన్న ఎమ్మెల్యేను నియమిస్తారని, కానీ సీనియారిటీని పట్టించుకోకుండా ఎంఐఎంకు ప్రొటెం స్పీకర్ పదవి ఇచ్చారని మండిపడ్డారు. ఈ కారణం వల్లే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ నియామకాన్ని వ్యతిరేకించారని లక్ష్మణ్ స్పష్టం చేశారు.
ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో రాజకీయం ఉందని అన్నారు. ప్రభుత్వం ఎవరి పేరు పంపితే వారినే గవర్నర్ ప్రొటెం స్పీకర్ గా నియమిస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నకర రాజకీయాలకు చిరునామాగా ఉందని లక్ష్మణ్ విమర్శించారు.