Rythu Bandhu: సాగు భూములకే రైతుబంధు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
- డిసెంబర్ చివరిలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్న కాంగ్రెస్ సీనియర్ నేత
- నిజమైన రైతులను గుర్తించేందుకు ప్రభుత్వం సమీక్ష చేస్తోందని వెల్లడి
- గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినా హామీలను నెరవేర్చుతామని దీమా
నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ‘రైతుబంధు’ డబ్బులు ఎప్పుడు జమచేస్తుందనే చర్చ నడుస్తున్న వేళ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాగుచేసే నిజమైన రైతులకే రైతుబంధు పెట్టుబడి సాయం అందజేసేలా ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తుందని అన్నారు. నిజమైన రైతుల ఖాతాల్లో డిసెంబరు చివరి నాటికి రైతుల అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు వేయనుందని పేర్కొన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఎకరాకు రూ.7500 చొప్పున సాయం అందజేయనున్నామని చెప్పారు. కొందరు భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వందల ఎకరాలను సాగు భూములుగా చూపిస్తూ రైతు బంధు సాయం పొందుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. దీనిపై పునరాలోచన చేస్తామని, ధరణిలో తప్పొప్పులను పరిశీలించి హామీ ఇచ్చినట్టుగా సాగుభూములకు రైతుబంధు వేస్తామన్నారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని, అయినప్పటికీ కేవలం ఆరు గ్యారంటీలతోపాటు ఇతర ప్రజా సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపేదిలేదని అన్నారు. ఆదివారం సారంగాపూర్ మండలంలోని రేచపల్లిలో ఆర్టీసీ బస్సు సేవలను జీవన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.