Nagababu: నాదెండ్ల మనోహర్ అరెస్ట్ పై నాగబాబు ఆగ్రహం
- ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలపడం తప్పా? అని ప్రశ్నించిన నాగబాబు
- టైకూన్ జంక్షన్ ను తెరవాలని కోరినందుకు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని విమర్శ
- పోలీసుల తీరును ఖండిస్తున్నామని వ్యాఖ్య
జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు నేతలను వైజాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. టైకూన్ జంక్షన్ లో రోడ్డును మూసివేయడంపై ధర్నాకు దిగిన నేపథ్యంలో వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం, పోలీసుల తీరుపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలపడం తప్పా? ప్రజల తరపున నిలబడటం తప్పా? సమస్యల పరిష్కారానికి ప్రజా గొంతుకను వినిపించడం తప్పా? మేము దాడులు చేయలేదు, దహనాలు చేయలేదు... రాజ్యాంగం మాకు కల్పించిన హక్కుల పరిధిలో పోరాడటం తప్పా? అని ప్రశ్నించారు.
విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు తమ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమయ్యారని... అయితే, వారిపట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని చెప్పారు.