rtc bus: ఉచిత బస్సు పథకంలో ఈ నెంబర్లకు ఫోన్ చేయండి: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

RTC MD Sajjanar advices to passengers

  • 040-69440000, 040-23450033 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని సూచన
  • జూబ్లీ బస్ స్టేషన్ నుంచి వెళ్లే ప్రయాణికులతో మాట్లాడిన సజ్జనార్
  • బస్సులో ప్రయాణించిన ఆర్టీసీ ఎండీ

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకు వచ్చింది. అమలు తీరును పరిశీలించేందుకు గాను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆయన సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణ అమలు తీరును పరిశీలించారు. జూబ్లీ బస్ నుంచి జనగామ, ప్రజ్ఞాపూర్, బాన్సువాడకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళా ప్రయాణికులతో ముచ్చటించారు.  ఆ తర్వాత జేబీఎస్-వెంకటరెడ్డి నగర్, సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడ వరకు ప్రయాణించారు. మహిళా ప్రయాణికులకు జీరో టిక్కెట్ అందించారు. 

ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ... ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన వస్తోందన్నారు. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీని భాగస్వామ్యం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంపై 40వేల మంది సిబ్బందికి అవగాహన కల్పించినట్లు చెప్పారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలు స్థానికతను నిర్ధారించుకునేందుకు ఆధార్ కార్డును చూపించి సంస్థకు సహకరించాలని కోరారు.

ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా ప్లాన్ రూపొందించుకున్నట్లు తెలిపారు. ఏవైనా పొరపాట్లు జరిగితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండే 040-69440000, 040-23450033 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని సూచించారు.

  • Loading...

More Telugu News