Vishnu Vardhan Reddy: అయ్యప్ప మాల వేసుకున్న బాలికను స్కూల్లోకి రానివ్వకపోవడం దారుణం: విష్ణువర్ధన్ రెడ్డి
- అయ్యప్పమాల వేసుకున్న బాలికకు స్కూల్లో ప్రవేశం నిరాకరణ
- హైదరాబాదులో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూలు తీరుపై విమర్శలు
- తెలంగాణ సీఎం, తెలంగాణ డీజీపీ దీనిపై స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలన్న విష్ణు
హైదరాబాదు బండ్లగూడలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లోకి అయ్యప్ప మాల వేసుకున్న బాలికను అనుమతించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు.
రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడలో ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం అయ్యప్ప మాల ధరించిన విద్యార్థినిని అనుమతించకపోవడం తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. స్కూలు యూనిఫాంలోనే రావాలని యాజమాన్యం కరాఖండీగా చెప్పడంతో, ఆ బాలిక గంట పాటు ఎండలోనే నిలుచోవాల్సి వచ్చిందని విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు.
ఇలాంటి దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రిని, తెలంగాణ డీజీపీని కోరుతున్నానని తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, మాల వేసుకున్నానని తను స్కూల్లోకి రానివ్వడంలేదని బాలిక చెబుతున్న వీడియోను కూడా విష్ణువర్ధన్ రెడ్డి పంచుకున్నారు.